కరీంనగర్,అర్జున్ సమాచారం:
రిజిస్ట్రేషన్ చట్టంలోని 22ఏ సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తూ పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చడం సరికాదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న అర్హత కలిగిన పట్టా భూములను వెంటనే తొలగించి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. భూ బాధితులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ. ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్ తదితర భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు రిజిస్ట్రేషన్ చట్టం-1908లోని 22ఏ సెక్షన్ ఉద్దేశించబడిందన్నారు. అయితే ఆ నిబంధనలను ఆధారంగా చేసుకుని ప్రైవేటు పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల వేలాది మంది భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
22ఏ 2 నిబంధనల ప్రకారం నిషేధిత జాబితాలో భూములను చేర్చే ప్రక్రియను చట్టబద్ధంగా చేపట్టాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కేవలం తహసీల్దార్, ఆర్డీవో లేదా జిల్లా కలెక్టర్ స్థాయిలోనే సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో చేర్చడం సాధ్యం కాదని, ప్రభుత్వ స్థాయిలో నిర్దేశిత ప్రక్రియను పాటించాల్సి ఉంటుందని అన్నారు. నిషేధిత జాబితాలో చేర్చిన భూముల విషయంలో భూ యజమానులకు న్యాయం జరిగేలా సమగ్రంగా పరిశీలించాలని కోరారు. ప్రైవేటు పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చే విషయంలో చట్టపరమైన ప్రక్రియను పాటించాల్సిన అవసరం ఉందన్నారు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 22ఏ సెక్షన్‌ను రాజకీయ ప్రయోజనాలు, అవినీతికి వేదికగా మార్చిందని ఆయన ఆరోపించారు. పట్టాదారులకు సరైన నోటీసులు ఇవ్వకుండా, నిర్దేశిత ప్రక్రియను పాటించకుండా వేలాది ఎకరాల భూములు, వేలాది ప్లాట్లను నిషేధిత జాబితాలో చేర్చారని విమర్శించారు.
ఊర్లకు ఊర్లే నిషేధిత జాబితాలో.
కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని రేకుర్తి, కొత్తయాస్వాడ, విద్యానగర్, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పట్టా భూములు 22ఏ జాబితాలోకి వెళ్లాయని గంగుల కమలాకర్ తెలిపారు. రేకుర్తి, విద్యానగర్, కొత్తపల్లి ప్రాంతాల్లో 22ఏ కారణంగా వేలాది మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఇటీవల వచ్చిన నివేదికలు కూడా పేర్కొంటున్నాయన్నారు
గ్రామపంచాయతీ, మున్సిపల్ అనుమతులతో ఇళ్లు నిర్మించుకున్న వారు, ఏళ్ల తరబడి భూములను అనుభవిస్తున్న పట్టాదారులు సైతం ఇప్పుడు వాటిని విక్రయించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్య, వైద్యం, వివాహాలు, కుటుంబ అవసరాల కోసం భూములను విక్రయించుకోవాల్సిన సమయంలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో బాధితులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
భూముల రికార్డుల విషయంలో ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు సమగ్రంగా పరిశీలించి స్పష్టత తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఒకవైపు అర్హత కలిగిన పట్టా భూములను 22ఏ జాబితాలో చేర్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ, మరోవైపు ప్రభుత్వ ప్రయోజనాల కోసం సేకరించిన భూముల రికార్డులు సరిచేయకపోవడం ఏంటని ప్రశ్నించారు.
రెవెన్యూ మంత్రి రాజీనామా చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా 22ఏ సెక్షన్ దుర్వినియోగంపై నైతిక బాధ్యత వహించి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేయాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.
కరీంనగర్ నియోజకవర్గంలోని రేకుర్తి, కొత్తయాస్వాడ, విద్యానగర్, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో నిషేధిత జాబితాలో చేర్చిన అర్హత కలిగిన పట్టా భూములను వెంటనే 22ఏ నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు.
సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని గంగుల కమలాకర్ హెచ్చరించారు. అవసరమైతే పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమానికి పిలుపునిస్తామని స్పష్టం చేశారు. భూ బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ వారి తరఫున పోరాటం కొనసాగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, టిఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, పలువురు టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు,ప్రజా ప్రతినిధులు,భూ బాధితులు, బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
==============================